కోహెడ, అక్టోబర్ 21 నేటిమాట న్యూస్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని కోహెడ మండలం ధర్మసాగర్‌పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని దహనం చేసిన ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 20న దసరా వేడుకల సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కొందరు యువకులు అనుమతి లేకుండా గుమికూడి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీని రావణాసురుడి రూపంలో తయారు చేయించి దహనం చేశారు. ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ కరివేద చంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ఐదుగురు గ్రామ యువకులతో పాటు కోహెడలోని మణికంఠ ఫ్లెక్సీ ప్రింటర్స్ నిర్వాహకుడు ఎండీ ఆరిఫ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్రిక్తతలు సృష్టించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.
ధర్మసాగర్‌పల్లిలో ప్రజాప్రతినిధుల చిత్రపటాల దహనం.. ఆరుగురిపై కేసు
RELATED ARTICLES

