🌹
సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోండి.. ఆన్లైన్ మోసాలకు బలికావద్దు
హుస్నాబాద్, అక్టోబరు 10, నేటిమాట : విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని భవిష్యత్తులో విజయవంతంగా ఎదగాలని హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితేనే ఆశించిన లక్ష్యాలను చేరుకోగలరని పేర్కొన్నారు.శుక్రవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వేముల గణేష్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ గైనకాలజిస్ట్ డాక్టర్ రమాదేవి, ఎస్టీ బాలుర హాస్టల్ వార్డెన్ విజయ్ కుమార్, బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మోహన్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో టాపర్గా నిలిచిన విద్యార్థిని ఆరె మాధవికి అతిథులు నగదు బహుమతి అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తూ, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.విద్యార్థులు విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, స్నేహభావం, పరస్పర సహకారాన్ని అలవర్చుకోవాలని అతిథులు ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ వేడుకల్లో నూతన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరస్పరం పరిచయాలు పెంచుకున్నారు. ఆటపాటలు, సందడితో కళాశాల ప్రాంగణం ఉల్లాసభరితంగా మారింది.
కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వేముల అంజయ్య, అంబేద్కర్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

