
చిగురుమామిడి, ఆగస్టు 30 నేటి మాట న్యూస్ :గ్రామంలో ప్రజలంతా సోదరభావంతో, ఐకమత్యంతో కలిసి మెలిసి జీవించాలని ఎంపీడీఓ రామ్మోహనచారి సూచించారు. చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలోని అంబేద్కర్ కూడలిలో శనివారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఒంటెల కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించారని తెలిపారు. సమాజంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలతో జీవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలు తమ పౌర హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
హోటళ్లలో రెండు గ్లాసుల విధానం, ఆలయ ప్రవేశం తదితర అంశాల్లో ఎలాంటి వివక్షకు తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా కులం, సామాజిక స్థితి ఆధారంగా వివక్ష చూపితే అది చట్టరీత్యా నేరమని, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
గ్రామ సర్పంచ్ కిషన్రెడ్డి మాట్లాడుతూ రామంచ గ్రామంలో ప్రజలంతా సోదరభావంతో కలిసి మెలిసి జీవిస్తున్నారని, గ్రామస్థుల మధ్య ఎలాంటి వివక్ష, బేధాభిప్రాయాలు లేవని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామంలో ఐకమత్యాన్ని కొనసాగిస్తూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ఆర్ఐ రజనీకాంత్రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ ప్రణయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, హాస్టల్ వార్డెన్, ఆశా వర్కర్, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

