Saturday, October 17, 2026

అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలు..!

ఉదయం ఆరు కాకముందే బెల్ట్‌ షాపులు తెరుచుకుంటున్నాయ్‌…!

నిబంధనలు గాలికొదిలి.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా…!

హుస్నాబాద్ , సెప్టెంబరు 29, నేటి మాట న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలో బెల్ట్‌ షాపుల నిర్వహణ యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం విక్రయాలకు నిర్దేశించిన సమయాలను పట్టించుకోకుండా రాత్రి, పగలు తేడా లేకుండా విక్రయాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలను అమలు చేయాల్సిన ఎక్సైజ్‌ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్
పట్టణంలోని 11వ వార్డు గాంధీ చౌరస్తా పరిసరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటినా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, ఉదయం 6 గంటలు కాకముందే విక్రయాలు ప్రారంభమవుతున్నాయని అంటున్నారు. దీంతో తెల్లవారుజామున నుంచే ఆ ప్రాంతంలో మద్యం కొనుగోలుదారుల రద్దీ కనిపిస్తోందని, బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారా..? నిర్వహిస్తే ఇంత తెల్లవారుజామున, అర్ధరాత్రి వరకు విక్రయాలు ఎలా కొనసాగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ విక్రయాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

మద్యం అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మామూళ్ల ఆరోపణలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, బెల్ట్‌ షాపుల వెనుక ఎవరెవరి అండదండలు ఉన్నాయో, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయా లేదా అన్నదానిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయా? నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular