Saturday, October 17, 2026

గొల్లపల్లి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

భీమదేవరపల్లి, ఆగస్టు 30 నేటి మాట న్యూస్ : గొల్లపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన మంత్రి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించి, ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు.

గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలో నీళ్లు నింపడం తన బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. కాలువల భూసేకరణకు పరిహారం అందిస్తున్నామని, సుప్రీంకోర్టులో ఉన్న కేసు కొట్టివేయబడిందని తెలిపారు.

గొల్లపల్లికి ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థల సేకరణ పూర్తయి తీర్మానం చేసిన వెంటనే గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, మహిళా భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజా పాలనలో భాగంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, మహిళా సంఘాలకు రుణాలు, రేషన్ కార్డులు తదితర పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు.

యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనాలని, గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా సామగ్రి అందిస్తోందని మంత్రి తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ బ్యాంక్‌లను వినియోగించాలని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో శేషాద్రి, జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ నేతుల చంద్రమోహన్, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular