Saturday, October 17, 2026

ముత్తారం గ్రామ సమగ్ర అభివృద్ధికి చర్యలు

– రూ.3.74 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన

-రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, ఆగస్టు 30 నేటి మాట న్యూస్ : ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా శనివారం ముత్తారం గ్రామంలో మంత్రి పర్యటించారు.

ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

గ్రామంలో ఇప్పటివరకు 8 ఇందిరమ్మ ఇళ్లు, 153 పెన్షన్లకు రూ.41.57 లక్షలు, 271 కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, 158 మంది రైతులకు రూ.1.35 కోట్ల రైతు రుణమాఫీ, 430 మంది రైతులకు రూ.2.18 కోట్ల రైతు భరోసా అందించినట్లు మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.1.17 కోట్ల రుణాలు అందించామని పేర్కొన్నారు.

గ్రామంలో ఓపెన్ జిమ్, క్రీడా సామగ్రి అందించామని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. మహిళా సంఘాల భవనానికి స్థల సేకరణపై తీర్మానం చేస్తే వీవో భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. కొత్త పెన్షన్లకు ఈ నెల 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని, ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ముత్తారం గ్రామానికి కాకతీయుల కాలం నుంచే చారిత్రక గుర్తింపు ఉందని, గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో గురవయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular