-కట్కూర్లో ప్రజలు, రైతులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖాముఖి
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెల్లో ప్రజాపాలన’ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కట్కూర్ గ్రామంలో ప్రజలు, రైతులతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసిందన్నారు. త్వరలోనే కాలువల నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు సుమారు 20 ఏళ్ల అనంతరం పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ప్రాజెక్టును సందర్శించనున్నారని మంత్రి వెల్లడించారు.
కట్కూర్ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే కట్కూర్–కన్నారం రహదారి విస్తరణకు ప్రాధాన్యత కల్పించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు.

