-మహిళా పారిశుధ్య సిబ్బందికి క్రీడా పోటీలు.. విజేతలకు షీల్డులు అందజేత
హుస్నాబాద్, ఆగస్టు 31, నేటిమాట న్యూస్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా పలు క్రీడా పోటీలు నిర్వహించారు.మహిళా పారిశుధ్య కార్మికులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతోపాటు సిబ్బంది మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని కార్యక్రమంలో పేర్కొన్నారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన మహిళా పారిశుధ్య సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి చేతుల మీదుగా షీల్డులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ పారిశుధ్య నిర్వహణలో నిరంతరం సేవలందిస్తున్న మహిళా సిబ్బందిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు. విధులతో పాటు క్రీడల్లోనూ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు అనూష, మంజుల, వరప్రసాద్, రమేష్, గాదెపాక రవీందర్, బత్తుల స్వరూప, శోభన్ బాబు, కో-ఆప్షన్ సభ్యుడు హసన్తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మహిళా పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

