అక్కన్నపేట, సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని సంజీవరాయిని గుట్టపై గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా వరద పాశం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ ప్రకృతి దేవతను ప్రార్థించారు.
రైతుల కష్టాలు తొలగి గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వరద పాశం నిర్వహించినట్లు గ్రామస్తులు తెలిపారు. సుమారు 40–50 ఏళ్లుగా ప్రతి ఏటా యాదవ, కురమ కులస్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా గుట్టపైకి చేరుకున్న గ్రామస్తులు బియ్యం, పాలతో నైవేద్యం తయారు చేసి సంజీవరాయిని గుట్టపై ఉన్న ఆంజనేయస్వామికి సమర్పించారు. అనంతరం నైవేద్యంలో కొంత భాగాన్ని పిల్లలకు పెట్టి, గుండంలోని నీటిని తీసుకెళ్లి పంట పొలాలు, పశువులపై చల్లితే మంచి జరుగుతుందని తమ పూర్వీకుల నుంచి వస్తున్న విశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

