హుస్నాబాద్, సెప్టెంబర్ 08 నేతిమాట న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడిన మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించడం తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
“మహిళా ప్రజాప్రతినిధులకే గౌరవం లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం భరోసా ఇస్తుంది?” అని సతీష్ కుమార్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను దాచలేరని అన్నారు.సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నియోజకవర్గంలో చేపట్టిన వరుస నిరసన కార్యక్రమాల ద్వారా రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

