తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై జగదీశ్వర్
చిగురుమామిడి, సెప్టెంబర్ 08 నేటిమాట న్యూస్ : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, మతసామరస్యంతో నిర్వహించాలని చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్ సూచించారు. వినాయక చవితి నేపథ్యంలో పోలీస్స్టేషన్లో మంగళవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, యువత, అన్ని వర్గాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు ప్రజలకు, ఇతర మతాల వారికి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, మత విద్వేషాలకు దారితీసే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 112 లేదా ఎస్సై 8712670772ను సంప్రదించాలని తెలిపారు.ప్రజలంతా పోలీసులకు సహకరించి వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, సోదరభావంతో జరుపుకోవాలని ఎస్సై కోరారు.

