హుస్నాబాద్ రూరల్, సెప్టెంబర్ 19, నేటిమాట న్యూస్ :గ్రామాల్లో నేరాలను అరికట్టడంతో పాటు ప్రజలకు భద్రతపై మరింత భరోసా కల్పించేందుకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ చేపట్టిన ‘సిద్దిపేట సురక్షా నేత్ర’ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని నాగారం, అంతకపేట గ్రామాల్లో మొత్తం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్ చొరవతో నాగారం గ్రామంలో 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటిని హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీధర్ ప్రారంభించారు. అలాగే అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను సీఐ శ్రీధర్, అక్కన్నపేట ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఏదైనా నేరం జరిగిన సందర్భంలో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. నేరస్తుల కదలికలను గుర్తించడం, నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు పోలీసులకు ఎంతగానో సహాయపడతాయని పేర్కొన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతా వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని అన్నారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత సిబ్బందిని అధికారులు అభినందించారు. కెమెరాల నిర్వహణ, పర్యవేక్షణలో గ్రామస్థులు సహకరించాలని సూచించారు.

