హుస్నాబాద్ టౌన్, సెప్టెంబరు 19, నేటిమాట న్యూస్ :హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ ఆధ్వర్యంలో శనివారం సీవీ రామన్ హైస్కూల్, కేరళ హైస్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ ఆర్. తిరుపతి విద్యార్థులకు హెచ్ఐవీ వ్యాధి వ్యాప్తికి గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.హెచ్ఐవీ పరీక్షలను ఐసీటీసీ కేంద్రంలో చేయించుకోవచ్చని, పరీక్షలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హెచ్ఐవీ–ఎయిడ్స్‌కు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం ఉచిత టోల్‌ఫ్రీ నంబర్ 1097కు ఫోన్ చేయవచ్చన్నారు. హెచ్ఐవీ ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.
దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, విద్యార్థులు హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుని ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.కార్యక్రమంలో సీవీ రామన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాయిత నారాయణరెడ్డి, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు జి. కిరణ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కేరళ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బుర్ర రాజేందర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

