500 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు
చిగురుమామిడి సెప్టెంబర్ 21 నేటిమాట న్యూస్ : గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కందితిరుపతి రెడ్డి, సుందరగిరి సర్పంచ్ జంగ శిరీష వెంకట రమణారెడ్డి సూచించారు. మండలంలోని సుందరగిరి గ్రామపంచాయతీ ఆవరణలో మేడికోవర్ హాస్పిటల్, డాక్టర్ శరత్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాల్లో 500 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.మేడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సుమారు 250 మందికి ఈసీజీ, థైరాయిడ్, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ షఫీ నేతృత్వంలో వైద్య సేవలు అందించారు.
అదేవిధంగా డాక్టర్ శరత్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరో 250 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పొర, శుక్లాలు తదితర సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి, అవసరమైన వారికి త్వరలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన ఆసుపత్రుల యాజమాన్యాలకు సర్పంచ్, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెడబోయిన రాజు, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీరామోజు రాజ్కుమార్, వార్డు సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది, క్యాంపు కోఆర్డినేటర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

