నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: హుస్నాబాద్ సీఐ శ్రీధర్
హుస్నాబాద్, సెప్టెంబర్ 21, నేటిమాట న్యూస్ : గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించాలని హుస్నాబాద్ సీఐ శ్రీధర్ గణేష్ మండపాల నిర్వాహకులకు సూచించారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం నిర్వహించాలని, చెరువులు, కాలువల్లో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, ఈత రాని వ్యక్తులు నీటిలోకి వెళ్లకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గణేష్ ఊరేగింపులో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని, ట్రాక్టర్లు, లారీలు, ట్రాలీలపై పరిమితికి మించి వ్యక్తులను తరలించవద్దని తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలకు అనుగుణంగా పరిమిత శబ్దంతో సౌండ్ సిస్టమ్ను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూజా సామగ్రి, వ్యర్థాలను నీటిలో వేయకుండా పర్యావరణహితంగా నిమజ్జనం చేయాలని కోరారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. “శాంతియుతమైన గణేష్ నిమజ్జనం.. అందరి బాధ్యత” అని సీఐ శ్రీధర్ పేర్కొన్నారు.

