కోహెడ, సెప్టెంబరు 25, నేటిమాట న్యూస్ : జాతీయ పోషణ మాసం (సెప్టెంబరు) సందర్భంగా కోహెడ మండలం సముద్రాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోషకాహారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించి, తల్లులకు సమతుల ఆహారం, పోషకాహారం ప్రాధాన్యత, పోషకాహార లోపం నివారణ చర్యలపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో పాటు చిన్నారుల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

