మరమ్మతులు పూర్తిచేసి ప్రజలకు నిరంతర తాగునీరు అందించాలి: కేడం లింగమూర్తి
హుస్నాబాద్, సెప్టెంబరు 25, నేటిమాట న్యూస్ : బాలవికాస వాటర్ ప్లాంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేడం లింగమూర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బాలవికాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను శుక్రవారం సందర్శించి పరిశీలించారు. గాంధీనగర్, గొల్లకుంట, పోతారం, ఉమ్మాపూర్, రాములపల్లి తదితర గ్రామాల్లోని వాటర్ ప్లాంట్ల పనితీరు, నిర్వహణ, రికార్డులు, ప్రజలకు తాగునీటి సరఫరా విధానాన్ని ఆయన పరిశీలించారు.యంత్ర పరికరాల్లో లోపాల కారణంగా పనిచేయకుండా ఉన్న వాటర్ ప్లాంట్లను గుర్తించిన కేడం లింగమూర్తి, వాటికి త్వరితగతిన మరమ్మతులు చేపట్టి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ప్లాంట్ల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని, ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో బాలవికాస ఆధ్వర్యంలో సుమారు 1,600 వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవసరం ఉన్న గ్రామాలను గుర్తించి కొత్త వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు.హుస్నాబాద్లో బాలవికాస ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నామని, త్వరలో మరో రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా వాటర్ ప్లాంట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో బాలవికాస సంస్థ చీఫ్ మేనేజర్ ఫ్రాన్సిస్ రెడ్డి, మేనేజర్ మధుసూదన్రెడ్డి, జోనల్ డైరెక్టర్లు రామలింగారెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ నరేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్, సంస్థ ప్రతినిధులు, సభ్యులు ఐలేని మల్లికార్జునరెడ్డి, ఆయా గ్రామాల కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

