హుస్నాబాద్ సెప్టెంబర్ 27, నేటిమాట న్యూస్ : తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను హుస్నాబాద్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ప్రజా నాయకుడిగా, న్యాయవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యజించి, పదవుల కంటే తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. పద్మశాలి సమాజం, చేనేత కార్మికుల సంక్షేమం కోసం బాపూజీ చేసిన కృషి మరువలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడమే బాపూజీకి నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వి. వెంకటరమణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెన్నరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బూర్ల రాజయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పద్మశాలి సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.

