హుస్నాబాద్ టౌన్, సెప్టెంబరు 28, నేటిమాట న్యూస్ : హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఐసీటీసీ కౌన్సిలర్ ఆర్. తిరుపతి అన్నారు. సోమవారం పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్లో ఐసీటీసీ ఆధ్వర్యంలో 9, 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు హెచ్ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. తిరుపతి మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తికి గల కారణాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఐసీటీసీ కేంద్రాల్లో నిర్వహించే హెచ్ఐవీ పరీక్షల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హెచ్ఐవీ–ఎయిడ్స్‌కు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1097కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన వారికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ ద్వారా చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు ఆరోగ్యం పట్ల అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ పి. నరసింహులు మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు మెడిటేషన్ ప్రాధాన్యతను వివరించారు. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, వయసుకు అనుగుణంగా ప్రతిరోజూ ధ్యానం చేయడం అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏ. రాధా సురేందర్, ప్రధానోపాధ్యాయులు ఎన్. నరసింహారెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

